11, మార్చి 2024, సోమవారం

 Ep3


ఎపిసోడ్ నం. 3
సృష్టి ఎలా మొదలైంది
సృష్టికి పూర్వము ఈ జగత్తంతా జలమయంగా ఉండేది. ఎటు చూసినా మహా సముద్రమే. దానికి ఎల్లలు లేవు. ఆ నీటి నుండి ఒక మహా తేజస్సు ఆవిర్భవించింది. క్రమంగా ఆ కాంతి పుంజము ఒక రూపు దాల్చింది. తేజోమయమైన ఆ కాంతి పుంజమే పరబ్రహ్మము. అదే పరమశివుడు.

ఆ పరబ్రహ్మ సృష్టి చేయాలి అని సంకల్పించాడు. తన శరీరములోని ఎడమభాగము నుండి ప్రకృతి స్వరూపిణిని సృష్టించాడు. ఆమే ఆదిశక్తి, పరాశక్తి, జగన్మాత, శక్తి ప్రాదుర్భామైన తరువాత పరమేశ్వరుడు సృష్టి ప్రారంభించాడు. మొదటగా పరమేశ్వరుడు ప్రకృతి స్వరూపమైన ఆదిశక్తిని తన వామాంకముపైనా ఆసీనురాలిని చేసి, ఆమెను కౌగిలించుకుని విహారానికి బయలుదేరాడు. ఆ సమయంలో పరమేశ్వరుని సంకల్పము వల్ల నీలమేఘశ్యాముడు, నాలుగు చేతులు కలవాడు, ఆ చేతుల యందు శంఖ, చక్ర, గదా, పద్మములను ధరించినవాడు, లక్ష్మీదేవితో కూడిన వాడు అయిన శ్రీమన్నారాయణుడు ఉద్భవించాడు. పరమేశ్వరుడు అతడికి పట్టువస్త్రములు, మణిమయ కిరీటము, కౌస్తుభము ప్రసాదించాడు.

అతడు పీత వస్త్రములు ధరించాడు కాబట్టి పీతాంబరుడు, లక్ష్మీ సమేతుడు కాబట్టి మాధవుడు, విశ్వవ్యాప్తి కాబట్టి విష్ణువు, సృష్టికి ముందుగా పుట్టాడు కాబట్టి పురుషోత్తముడు అని ప్రసిద్ది చెందాడు. పరమేశ్వరుడు నారాయణుడికి "ఓం నమశ్శివాయ' అనే పంచాక్షరీ మహా మంత్రాన్ని ఉపదేశించి "నారాయణా! సర్వకాల సర్వావస్తలయందు ఈ మంత్రాన్ని జపించు. ఈ జగసృష్టిలో నీదే ముఖ్యపాత్ర" అని వివరించాడు.

విష్ణుమూర్తి సముద్రంలో వటపత్రము మీద శయనించి పంచాక్షరీ మంత్ర జపం చేస్తుండగా అశరీరవాణి ఇలా పలికింది "ఓయీ..! నారము నందుండుట చేత నీవు నారాయణుడ వనబడుదువు" అని పలికింది. నారము అనగా నీరు, జ్ఞానము అని అర్ధము. అందుకే శ్రీమన్నారాయణుడు జ్ఞాననిధి.

ప్రకృతి త్రిగుణాత్మకమైనది. అనగా సత్వరజస్తమోగుణములతో కలిసి ఉన్నది. పరబ్రహ్మ చిఛక్త్యాత్మకమగు తన వీర్యమును. గుణ సంచలనము లేనప్పుడు ప్రకృతి యొక్క యోని యందుంచాడు. దీనివల్ల మహత్తత్త్వము పుట్టింది. మహత్తత్త్వము వికారము పొందటం వల్ల అహంకారము జనించింది. ఈ రకంగా అవ్యక్తమైన పరబ్రహ్మ నుండి మహత్తత్త్వము, అహంకారము వచ్చినాయి. అహంకారము నుండి పంచతన్మాత్రలు (శబ్ద, స్పర్శ, రూప, రస గ్రంధాలు. వాటి నుండి పంచభూతాలు (పృధివి, జలము, తేజస్సు, వాయువు, ఆకాశము), వాటి నుండి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తము ఉద్భవించినాయి.

ఇప్పుడు శ్రీ మహావిష్ణువు సృష్టి చేయగోరి వేదములు, 24 తత్త్వములు, త్రిగుణములను ఒక్కసారి స్మరించాడు. ఆ సమయంలో అతని నాభి నుండి మహా పద్మము ఒకటి ఆవిర్భవించింది. ఓం నమశ్శివాయ


 Ep3 ఎపిసోడ్ నం. 3 సృష్టి ఎలా మొదలైంది సృష్టికి పూర్వము ఈ జగత్తంతా జలమయంగా ఉండేది. ఎటు చూసినా మహా సముద్రమే. దానికి ఎల్లలు లేవు. ఆ నీటి నుం...