మార్కండేయ చరిత్ర పూర్తి కధ
--------------------------------------------------------------
అల్పాయుషు కలిగిన బాలుడు... 'ఏడు కల్పాల' వరకు ఆయుషు ఎలా పొందాడు.. పరమేశ్వరుడు ఇచ్చిన వరం ఏమిటి..? యమధర్మరాజునే ఎందుకు దిక్కరించాడు. శివుడికి కోపం ఎందుకు వచ్చింది. మార్కండేయుని గురించి మీకు తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలు... చివరి వరకూ చూడండి. శివుని అనుగ్రహం ఉంటుంది.
పూర్వకాలంలో మృకండుడు అని ఒక మహార్షి ఉండేవాడు. ఆయన భార్య మరుద్వతీ దేవి. పరమసాధ్వి, మహా పతివ్రత, వారికి సంతానం లేదు. ఒక రోజు మిగిలిన మహార్షులతో కలిసి మృకండుడు సత్యలోకానికి వెళ్లాడు. అక్కడ సంతానము లేనివారికి ఉత్తమ గతులు లేవు. అందుచేత నీకు ఈ లోకంలోకి ప్రవేశం లేదు అంటూ మృకండుని ఆపేశారు ద్వారపాలకులు. చేసేది లేక ఇంటికి వచ్చి జరిగిందంతా భార్యతో చెప్పాడు.
ఆ దంపతులు హిమాలయ పర్వాతాలకు వెళ్లి శివుని గురించి ఘోర తపస్సు చేశారు. వారి తపస్సుకు మెచ్చి ఈశ్వరుడు ప్రత్యక్షమై ' ఏం వరం కావాలో కోరుకోండి ' అన్నాడు. ఆ దంపతులు సంతాన భాగ్యము కావాలి అన్నారు. దానికి ఈశ్వరుడు బుషి దంపతులారా..! మీకు సంతాన యోగం లేదు. అయినా తపస్సు చేసి అర్థించారు కాబట్టి. బుద్ధివంతుడు, వేదవేదాంగవిధుడు అయిన బాలుడిని ప్రసాదిస్తాను. కాని అతని ఆయుష్షు పదహారు సంవత్సరాలే ఉంటుంది. అని చెప్పి అంతర్ధానం అయ్యాడు. కొంత కాలానికి మృకండుని భార్య గర్భవతి అయి పండంటి మగబిడ్డను ప్రసవించింది. మునీశ్వరులంతా ఆ బాలుడికి మార్కండేయుడు అని పేరు పెట్టారు.
మార్కండేయుడు గొప్ప శివభక్తుడు. పిల్లవాడికి ఐదవ ఏట అక్షరాభ్యాసం చేశారు. మునీశ్వరులంతా అతన్ని 'దీర్ఘాయురస్తూ' అని దీవించారు. బాలుడు అల్పాయుష్కుడు అని ఈశ్వరుడన్నాడు. దీర్ఘాయువు కమ్మని మునీశ్వరులు దీవించారు. ఏం జరుగుతుందో..? దైవ సంకల్పం.. ఏ రకంగా ఉన్నదో అని ఊరుకున్నాడు మృకండుడు.
మార్కండేయుడు ఏక సంతాగ్రాహి. అందుచేత వేదవేదాంగాలు అన్నింటినీ కొద్ది రోజులలోనే నేర్చుకున్నాడు. అతి చిన్న వయస్సులోనే మహా పండితుడయిన మార్కండేయుడిని చూసి చుట్టు ప్రక్కల వాళ్లు, తల్లిదండ్రులూ, అందరూ ఆనందించారు.
పిల్లవాడు మహా పండితుడు అనే ఆనందం ఒక ప్రక్క. అల్పాయుష్కుడనే బాధ మరో ప్రక్క.. తల్లిదండ్రులు మాత్రం ఆశ నిరాశల మధ్య ఊగుతున్నారు. ఈ రకంగా పదిహేను సంవత్సరాలు గడిచాయి. ఒక రోజున నారద మునీంద్రుడు మృకండుని ఆశ్రమానికి వచ్చాడు. మృకండుడు నారదుడికి ఆతిధ్యం ఇచ్చి గౌరవించాడు. కుశల ప్రశ్నల తరువాత. మాటల మధ్యలో మార్కండేయుడిని చూశాడు. సాముద్రిక లక్షణాలను భట్టి ఈ బాలుడు చాలా గొప్పవాడవుతాడు. భక్త శిఖామణి, లోకైక పూజ్యుడవుతాడు. కానీ ఇతడికి ఇంకొక సంవత్సరమే ఆయుర్ధాయమున్నది. విచారించి లాభం లేదు. ఈ బాలుడు శివభక్తుడు, శివుడు భక్త సులభుడు, ఈశ్వరుడిని భక్తితో మెప్పించి వరాలు పొందటం అతి తేలిక. ఈ సంవత్సర కాలంలో మార్కండేయుడు శివుడిని మెప్పించగలడు. నాయనా..! గోదావరి నదీ తీరములో గౌతముడి సిద్ధాశ్రమమున్నది.
పూర్వకాలంలో అదితి, కశ్యపులకు వామనుడు అక్కడే జన్మించాడు. అందుచేత అది సిద్ధ జనార్ధన క్షేత్రము అని కూడా పిలవబడుతుంది. అక్కడ రాజరాజేశ్వరి, సోమలింగేశ్వరులున్నారు. గతంలో శ్వేతకేతు అనే రాజు. శుక్రుడూ ఆ ప్రాంతంలోనే పరమేశ్వరుణ్ణి ఆరాధించారు. నువ్వు కూడా అక్కడికి వెళ్లి శివుని గురించి తపస్సు చెయ్యి అన్నాడు. మార్కండేయుడు గౌతమీ తీరం చేరాడు. నదిలో స్నానం చేసి, గౌతముడికి నమస్కరించి తపస్సు చెయ్యటం ప్రారంభించాడు. ఇలా ఒక యేడాది గడిచిపోయింది. మాఘశుద్ధ పంచమి మార్కండేయుని జన్మదినం. ఆ రోజుతో మార్కండేయుడికి పదహారు సంవత్సరాలు నిండాయి. మార్కండేయుని ఆయుషు తీరింది. యమధర్మరాజు దూతలను పంపాడు. యమధూతలను చూసి మార్కండేయుడు శివుణ్ణి శరణు వేడాడు. శివాలయం లోపలికి వెళ్లి కూర్చున్నాడు. యమధూతలు ఆలయ ప్రవేశం చేయబోయారు. కాలభైరవుడు గధతో వారిని అడ్డగించాడు. లోపలికి ప్రవేశం లేదు వెళ్లిపోండి అని గద్దించాడు. దూతలు జరిగిన విషయాలన్నీ తమ ఏలికకు విన్నవించారు. మాఘశుద్ధ సప్తమి.. యముడు దున్నపోతు నెక్కి మార్కండేయుని కోసం బయలుదేరాడు. నదీ స్నానం చేసి శివుడికి అభిషేకం చేస్తున్నాడు మార్కండేయుడు.
మార్కండేయుడిని రమ్మని పిలిచాడు యముడు. పూజ మధ్యలో ఉన్నది. శివపూజకు అంతరాయం కలిగించవద్దు. సకల ధర్మవేత్తవు.. నీకు తెలియని ధర్మం లేదు కదా..? అన్నాడు మార్కండేయుడు.
తను పిలిస్తే ఒక బాలుడు రాననడంతో యమధర్మరాజుకు కోపం వచ్చింది వెంటనే చేతిలోని పాశం మార్కండేయుడి మీదకు విసిరాడు. మార్కండేయుడు శంకరా పాహిమాం.. అంటూ శివలింగాన్ని ఆలింగనం చేసుకున్నాడు. యముడు కోపంతో పాశాన్ని లాగాడు. ఆ పాశము శివలింగాన్ని కూడా కుదిపివేసింది. ఢమ ఢమ ధ్వనులతో, పెళ పెళ రావాలతో కోటి సూర్యుల కాంతితో ఐదు ముఖాలు, మూడు కనులు.. ఖడ్గం, పరశువు, శూలము ధరించి గజ చర్మాంబరధారి అయిన ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. పరమ భక్తితో నమస్కరించాడు మార్కండేయుడు. నీకు భయం లేదు. నిశ్చింతగా ఉండు అని మార్కండేయుడికి అభయమిచ్చాడు. సమవర్తీ..! ధర్మ నిర్వహణలో నీవు హద్దు మీరి ప్రవర్తించావు. ఈ బాలుడు నా భక్తుడు. అతడి జోలికి ఎందుకు వెళ్లావు. అంటూ యముణ్ని శిక్షించాడు.
బ్రహ్మాది దేవతలంతా వచ్చి యముడు తన పని తాను చేశాడు. కాబట్టి అతన్ని క్షమించమని వేడగా శివుడు శాంతించి.. యమధర్మరాజా..! నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు కాని ' నా భక్తుల జోలికి మాత్రం వెళ్లకు ' అని ఆజ్ఞాపించాడు. మార్కండేయుడికి ' ఏడు కల్పాల ' వరకు ఆయుషునిచ్చి దీవించాడు. ఈ విధంగా పదహారు సంవత్సరాలు అయుషు కలిగిన మార్కండేయుడు ' ఏడు కల్పాల' వరకు ఆయుష్షు పొందాడు. అందుకే శివుడిని కొలిచిన వారికి ఎలాంటి బాధలు, కష్టాలు ఉండవని మార్కండేయుని కథ చెబుతుంది.
ఇలాంటి మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం.. మన చానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆలపై నొక్కండి. మేము వీడియో పోస్ట్ చేయగానే ముందుగా మీకే వస్తుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి