శివుడిని మోహించిన ముని భార్యలు
------------------------------------------------------------------------------------------------------------------
దారువనం అనే తపోవనం ఉండేది. అక్కడకి చాలా మంది మునులు తపస్సు చేసుకోవడానికి వచ్చేవారు. ఒకసారి ఎందరో మునులు, వారి భార్యలతో సహా అక్కడికి వచ్చారు. అగ్ని దేవుడ్ని ఉపాసిస్తూ కఠోరమైన తపస్సు చేస్తున్నారు.
------------------------------------------------------------------------------------------------------------------
ఒకనాడు వారందరినీ పరీక్షించాలని భావించాడు పరమేశ్వరుడు. ఈశ్వరుడు ఒక సుందర రూపాన్ని ధరించి ఆ దారువనానికి వెళ్లాడు. ఎంతో చక్కని రూపం. చూస్తే కళ్లు చెదిరే అందం అంత చక్కని రూపం ధరించాడు. ఆ ధారువనంలో అటు ఇటు తిరుగుతున్నాడు. అక్కడే ఉన్న ముని భార్యలు ఆ సుందర రూపుడ్ని చూశారు. ఆయన మీద మోహం పెంచుకున్నారు. అబ్బా ఎంత చక్కని రూపం ఆ పురుషునిది. ఆ తేజేమయం కలిగిన పురుషుడ్ని చూస్తే నా ఒళ్లు పులకరించిపోతుంది. అంటూ అతని మీద వ్యామోహం పెంచుకున్నారు. మునులభార్యలు మహా పతివ్రతలు అయినా అతని మీద వ్యామోహం పెంచుకున్నారు.
వారి మనస్సు చలించింది. ఆ సుందర పురుషుడేమో తపోవనంలో నాణ్యం చేస్తూ సంచరిస్తూ ఉన్నాడు. తాపం ఆపుకోలేక మునిపత్ర్నులు యుక్తాయుక్తాలు మరిచి ఆయన వెంట పడ్డారు. తమ శరీరం మీదున్న వస్త్రాలు, ఆభరణాలు శరీరం నుంచి తొలగిపోతున్నాయి. అయినా కూడా ఆ సుందరుడ్ని ఆకర్షించాలని అందంగా నాట్యాలు చేస్తున్నారు. మరి కొందరేమే సంగీతాన్ని ఆలపిస్తున్నారు.
------------------------------------------------------------------------------------------------------------------
ఇంకొందరు ఒక అడుగు ముందుకేసి మరి ఓ సుందరా.. ఓ సుందరా... ఆగు.. ఆగు... అని ఆయన వెళ్లే దారికి అడ్డంగా నిలబడి కౌగిలించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఆ స్త్రీలలో మన్మథ వికారం మితీమీరిపోయింది. ఇక తట్టుకోలేక ఆ సుందరరూపుడిని ఆపేశారు.
------------------------------------------------------------------------------------------------------------------
ఎవరు నీవు..? ఎక్కడి నుంచి వచ్చావు. ఓ సుందరాంగా..! దయచేసి మమ్మల్ని అనుగ్రహించు. మా శరీరాలకు ఆనందాన్ని కలిగించు. మధన తాపాన్ని తట్టుకోలేకపోతున్నాము. అని సిగ్గు విడిచి అడిగారు మునిపత్ర్నులు.
------------------------------------------------------------------------------------------------------------------
ముని పత్ర్నులు తనని ఎంతగా రెచ్చగొట్టినా ఆ సుందర పురుషుడు ఏ మాత్రం చలించలేదు. ఏమీ మాట్లాడకుండా నిశ్చిలంగా నిల్చుని ఉన్నాడు..భార్యలు కనిపించకపోవడంతో మునులు ఆ వనంలో వెతుకుతూన్నారు. ఇక్కడేమో ఆ సుందర రూపుడ్ని ప్రాధేయపడుతున్నారు. మునులు భార్యలను చూశారు. కోపంతో అక్కడికి వచ్చారు. తమ భార్యలకు మధన వికారం కలిగించిన అతడిని అనేక విధాలుగా ఎన్నో మాటలతో దూషించారు. ఎన్నో శాపాలు ఇచ్చారు. కాని అవేవి ఆయన్ని ఏమీ చేయలేకపోయాయి. రుషుల శాపాలు పరమేశ్వరుడి మీద తప్పా మిగిలిన దేవతల మీద తీవ్ర ప్రభావాన్ని చూపించాయి.
------------------------------------------------------------------------------------------------------------------
పూర్వం మునులు ఇచ్చిన శాపాలు :
గతంలో ఒకసారి దధీచి ఇచ్చిన శాపం కారణంగా దక్షుడి యాగం ధ్వంసమైంది. భృగు మహర్షి శాపం వలన శ్రీహరి పది అవతారాలు ఎత్తవలసి వచ్చింది. గౌతముడి ఆగ్రహంతో దేవేంద్రుడి వృషణాలు జారిపడ్డాయి.
పూర్వం మునులందరి శాపంతో శ్రీ హరి శయనించే క్షీర సముద్రం, అమృత సముద్రం తాగటానికి ఏ మాత్రం పనికి రాకుండా పోయింది. అప్పుడు నారాయణుడు కాశీక్షేత్రానికి వెళ్లి క్షీరంతో విశ్వేశ్వరుడిని అభిషేకించాడు. అప్పుడ క్షీర సముద్రం తిరిగి పూర్వ స్థితికి వచ్చింది.
------------------------------------------------------------------------------------------------------------------
ఇక మాండవ్య మహార్షి శాపంతో ధర్మదేవత కృతయుగం నుంచి కలియుగానకి వచ్చే సరికి క్రమంగా క్షీణించ సాగింది. మహాత్ముడైన దుర్వాసుడు ఇచ్చిన శాప ఫలితంగా యాదవులంతా ఒకరినొకరు కొట్టుకుని అంతఃకలహాలలతో అంతరించిపోయారు. భృగు మహర్షి శ్రీహరి | వక్ష స్ధలాన్ని తన్నడంతో అక్కడే నివాసమున్న లక్ష్మీదేవి ఆ స్థానాన్ని వదిలి భూ లోకంలో నివాసం ఏర్పాటు చేసుకుంది. అష్టవసువులు కూడా మునుల శాపాలకు గురై భూ లోకంలో మానవులుగా జన్మించారు.
ఈ విధంగా ఎంతో మంది మునుల, మహార్షుల శాపాలకి గురైనప్పటికీ మహా దేవుడు మాత్రం ముని శాపాల ఫలాన్ని ఏ మాత్రం పొందలేదని ఈ దారువనం కథ చెబుతుంది. ఇలా శంకరుడు సుందర పురుషుడుగా, దిగంబరంగా సంచరించటాన్ని చూసి భరించలేని మునులు ఆయన్ని సామాన్య మానవునిగా భావించి, పరుష పదజాలంతో నిందించటంతో వెంటనే పరమేశ్వరుడు అక్కడి నుంచి అంతర్ధానం అయ్యాడు. దీంతో వచ్చింది ఎవరో తెలియక ఆ మునులంతా కలత చెందారు. వెంటనే అక్కడి నుంచి బ్రహ్మా దేవుని వద్దకు వెళ్లారు. జరిగిన విషయం అంతా ఆయనకు చెప్పారు. వారి మాటలు అన్నీ విన్న బ్రహ్మాదేవుడు పరమేశ్వరుడిని మనస్సులో స్మరించుకున్నాడు. ఇదంతా ఈశ్వరుని లీలేనని గ్రహించారు. భక్తితో నమస్కరించాడు.
------------------------------------------------------------------------------------------------------------------
బ్రహ్మా మునులతో ఇలా అన్నాడు. ఓ మునులారా..! మీరెంత అవివేకులు. ఇహపర శ్రేయస్నుని కలిగించే పరమేశ్వరుణ్ణి గుర్తించలేని మీరు వ్యర్ధంగా జన్మించారు. దారువనంలో మీకు కనిపించి న ఆ పురుషుడు సాక్ష్యాత్తు శంకరుడే. మిమ్మల్ని పరీక్షించాలని ఆయన అక్కడికి వచ్చారు.
------------------------------------------------------------------------------------------------------------------
ఒక వ్యక్తి మీ వద్దకు వచ్చినప్పుడు.. అ ఆతిథి ఎలాంటి వాడైనా, ఏ రూపంలో ఉన్నా అతన్ని గౌరవించాలి. అదే అతిథి సేవ లక్షణం. ఆ ధర్మాన్ని మీరు విస్మరించారు. మునులు చేసిన తప్పిదాన్ని తలుచుకుని ఈశ్వరుడ్ని భక్తితో వేడుకున్నారు. ఈశ్వరుడు వారిని అనుగ్రహించాడు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి