శిఖరం లేని ఆలయం.
తెల్ల మద్ది చెట్టే శిఖరం.
స్వయంభూ క్షేత్రం.
విశిష్టమైన హనుమ దివ్యక్షేత్రం.
-------------
కుడి చేతిలో గధ
ఎడమ చేతిలో అరటిపండు.
అడుగు ముందుకు వేసి అభయమిచ్చే హనుమ.
స్వామి శిరస్సుపై ఐదు శిరస్సుల సర్పరాజంగా మద్దిచెట్టు తొర్ర
భక్తుల పాలిట కొంగుబంగారం....
ఇలా ఎన్నో, ఎన్నెన్నో విశిష్టతలతో కూడిన హనుమ సన్నిధి. శ్రీమద్ది ఆంజనేయస్వామి వారి ఆలయం. జంగారెడ్డిగూడెం, గురవాయిగూడెం గ్రామంలో ఎర్రకాలువ ఒడ్డున, పచ్చని పొలాల మధ్యన, అర్జున వృక్షం తొర్రలో కొలువైనాడు వాయుపుత్రుడు. గర్గ సంహిత, శ్రీమద్రామాయణం, పద్మ పురాణాలో స్థలపురాణం గురించి వ్రాయబడింది.
త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగంతో ఈ దివ్యక్షేత్రం ముడిపడి ఉంది. ఆ విశేషాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
త్రేతాయుగం :
రావణుని సైన్యంలో మద్వాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అవడానికి రాక్షసుడే అయినా సాత్విక చింతనతో, ఆధ్యాత్మిక భక్తిభావంతో ఉండేవాడు. సీతామాతను అన్వేషిస్తూ హనుమ లంకను చేరినప్పుడు హనుమ పరాక్రమాన్ని ప్రత్యక్షంగా చూసి భక్తుడయ్యాడు. రామరావణ యుద్ధంలో రాముని వైపు పోరాడుతున్న 'హనుమను చూసి మనస్సు చలించి, అస్త్ర సన్యాసం చేసి 'హనుమా' అంటూ గట్టిగా అరిచి తనువు చాలించాడు.
ద్వాపరయుగంలో :
ద్వాపరంలో మద్వకుడు అనే పేరుతో జన్మించాడు. కురుక్షేత్ర యుద్ధంలో, కౌరవుల వైపు నిలిచి యుద్ధం చేస్తున్నాడు. అప్పుడు అర్జనుని రధం పైనున్న "జండా పై కపిరాజు (ఆంజనేయన్వామి వారు)ను చూశాడు. గతజన్మ గుర్తుకొచ్చింది. హనుమా... హనుమా... అంటూ అర్జునుడి రథం వైపు పరుగెత్తాడు... అలా పరుగెడుతున్నప్పుడు వీర మరణం పొందాడు.
కలియుగంలో :
కలిలో మద్వడు అనే పేరుతో జన్మించాడు. హనుమ అనుగ్రహం కోసం తపస్సు చేయాలనుకున్నాడు. ఎర్రకాలువ ఒడ్డున కుటీరం ఏర్పాటు చేసుకుని ప్రతి దినం కాలువలో దిగి స్నానం ఆచరించేవాడు.. ఆ తరువాత తపస్సు చేసుకునేవాడు.. ఇలా ఎన్నో ఏళ్ళు గడిచాయి. ఒకరోజు ఎర్రకాలువలో ఉదయం స్నానం చేసి పైకి వస్తున్నప్పుడు కాలుజారి నదిలో పడబోయాడు. అప్పుడు ఉన్నట్టుంది ఏదో శక్తి తన చేయిని పట్టుకుంది. తలెత్తి పైకి చూశాడు. ఒక కోతి అతని చేయిని పట్టుకుని నీటిలో పడకుండా ఆపింది. ఆ వెంటనే చిరునవ్వు నవ్వి పైకి లాగింది. ఆ తరువాత అతనికి ఒక ఫలం ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
రెండవ రోజు కూడా ఆ కోతి మళ్లీ వచ్చింది. ఫలాన్ని ఇచ్చింది. ఇలా చాలా రోజులు జరిగింది. ఆ తరువాత ఒకరోజు అతను ధ్యానంలో వుండగా ఆ వానరం కనిపించింది. హనుమంతుడే ఆ వానరం అని గ్రహించాడు.. ఎంతో బాధపడ్డాడు. మనసు చలించింది.. దుఖం ఆగడం లేదు.. వెంటనే స్వామి.. ఇన్నాళ్లూ మీతో సపర్యలు చేయించుకున్నానా!.. నేను పాపాత్ముడిని, జీవించి ఉండుట అనవసరం. ఇక చావే నాకు శరణ్యం... అని భోరున విలపిస్తున్నాడు.. అప్పుడు స్వామి హనుమ ప్రత్యక్షమైయ్యాడు... మద్వా.. ఇందులో నీతప్పు ఎంతమాత్రమూ లేదు. నీ స్వామి భక్తికి మెచ్చి నేనే నీకు సపర్యలు చేశాను. ఏం వరం కావాలో కోరుకో అన్నాడు స్వామి...
స్వామి మీరు ఎల్లప్పుడూ నా చెంతే ఉండాలి నిన్ను విచిడి నేను వుండలేను.... అని మద్వ మహర్షి కోరాడు... మద్వా నీవు తెల్లమద్దిచెట్టుగా ఇక్కడ అవతరించు. నేను కూడా నీ సమీపంలోనే శిలారూపంగా కొలువై వుంటాను. నీకోరిక ప్రకారం ఎల్లప్పుడూ నీ చెంతే ఉంటా.. అని వరం ఇచ్చి ఇక్కడ వెలిశారు.
కలలో కనిపించిన స్వామి :
ఆ తరువాత కాలంలో అంటే 1966 నవంబర్ 1న ఒక భక్తురాలికి స్వప్నంలో స్వామి కనిపించాడు. తాను చెట్టు తొర్రలో ఉన్నానని, శిఖరం లేకుండా ఆలయం నిర్మించమని స్వామి చెప్పాడు.. ఆ భక్తురాలు పరుగుపరుగునా స్వామి వద్దకు వెళ్లింది. ముందు కేవలం స్వామి చుట్టూ చిన్న గర్భాలయం నిర్మించింది.
40 సంవత్సరాల క్రితం మండపం మరియు ఆలయం నిర్మించారు. విశేష సంఖ్యలో భక్తుల పెరగడంతో ఆలయాన్ని పునర్నిర్మించారు. సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు మద్ది దివ్యక్షేత్రంగా భాసిల్లుతోంది. మద్దిక్షేత్రంలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు త్రిమూర్తులను కూడా భక్తులు దర్శించుకోవచ్చు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పిల్లలు ఇలా ఒకటేమిటి ఏది కోరుకున్నా వెంటనే నెరవేరుస్తాడని భక్తులు నమ్ముతారు. ముఖ్యంగా దోషాలు వున్నవారు ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు. పవిత్రోత్సవాలు భాద్రపద శుద్ధ నవమి నుండి భాద్రపద శుద్ధ ద్వాదశి వరకూ జరుగుతాయి. ప్రవచనాలు, భజనలు, శోభాయాత్ర, తెప్పోత్సవం ఇలా ఒకటేమిటి ప్రతిదీ ఈ క్షేత్రంలో ప్రత్యేకమే.
ఈ వీడియో మీకు నచ్చితే like, comment, Share చేసి, subscribe చేయగలరు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి