10, ఆగస్టు 2022, బుధవారం

భక్తి తొమ్మిది రకాలు

 భక్తి తొమ్మిది రకాలు

శివపురాణానికి స్వాగతం. శివుని మహిమలను వివిధ భాగాలుగా వింటున్న మీ అందరికీ ఆ ప‌ర‌మేశ్వరుని క‌టాక్షాలు ల‌భించాల‌ని కోరుతూ.. ఈ వీడియోలో మహాదేవుడు స‌తీదేవికి బోధించిన తొమ్మిది ర‌కాల భ‌క్తి ప‌ద్ద‌తుల గురించి తెలుసుకుందాం.. ఈ వీడియోని చూసే ముందు కామెంట్‌లో ఓం న‌మ‌శివాయా అని రాసి విన‌గ‌ల‌రు. స‌తీదేవి శివుని వివాహం జ‌రిగిన త‌రువాత దాక్షాయ‌ణికి శివుడు ఇలా చెప్ప‌డం మొద‌లు పెట్టాడు. 

"ఓ సతీదేవి! భక్తికీ జ్ఞానానికీ అట్టే భేదం లేదు. కానీ భక్తే ఒక చూపు వాసిగా చెప్పుకోవలసి వస్తుంది. జ్ఞానంవల్ల ఐహికం అర్ధరహితమౌతుంది. భక్తులకు మాత్రం పరంతోబాటే ఐహికసుఖం కూడా అనుషంగికంగా అనుభవిస్తుంది. ఈ భక్తి తొమ్మిది రకాలుగా ఉంటుంది.

----------------------------------------------



మొద‌టిది శ్రవణం :- ఇతరుల ద్వారా నా గురించి వినడం. రెండ‌వ‌ది కీర్తనం : అంటే తనకు తానై నన్ను స్తుతించడం. ఇక మూడ‌వ‌ది స్మరణం :- ఎప్పుడూ నన్నే తలపులో వుంచుకోవడం, నామ జపం చేయడం. నాలుగ‌వ‌ది సేవనం :- రోజుకు ఐదు పర్యాయాలు వాక్కులతో స్తుతిస్తూ, చేతులారా నన్ను పూజించడం. అనంత‌రం ఐద‌వ‌ది దాస్యం:- అంటే నేను వినడం లేద‌ని తెలిసి కూడా నా సేవ తప్ప వేరు యెరుగక సర్వదా నాకు ప్రీతికరాలైన పనులు చేయడం. అనంత‌రం ఆర‌వ‌ది అర్చన:- తగిన సమయాలలో అర్ఘ్యపాద్యాది షోడశోపచారాలతో నన్ను పూజించడం. త‌రుప‌రి ఏడ‌వ‌ది వందనం:- నామంత్రోచ్చారణతో నా ధ్యానంతో మనో వాక్కాయశుద్ధిగా వక్షం, శిరసు, నేత్రాలు, మనస్సు, వాక్కు, పాదములు, హస్తములు, కర్ణములు భూమికి తాకే విధంగా నాకు ఆచరించే నమస్కారమే వందనం. ఇక ఏనిమిద‌వ‌ది. సఖ్యం:- ఏది జరిగినా అది తన మేలుకోసమే అని త‌ల‌చి నాచే జరిపించబడినట్లు భావించడం సఖ్యం. చివ‌రిగా మిగిలింది తొమ్మ‌ద‌వ‌ది ఆత్మార్పణం:- త‌న‌ శరీరంగాని, మరొకటి గాని తమవనే భావన ఉంచుకోకుండా, దేహ పోషణకై దేవుళ్ళాడి పోకుండా, భారం నామీద పెట్టి  నాచేత‌ యీయబడిన బ్రతుకు కొనసాగించడమే ఆత్మార్పణం.


ఈ తొమ్మిది రకాల భక్తిలో దేనిననుసరించినా నాకు ఆనందమే. దాక్షాయ‌ణీ మ‌రోక విష‌యం బిల్వ సమీకరణాది ఉపాంగాలు కూడా కొన్ని వున్నాయనుకో కానీ ఏదిఏమైనా *భక్తి ప్రధానం* భక్తి రహితమైన జ్ఞానం ఎందుకూ కొరగాకుండా పోతుంది. భక్తి - ఎటువంటి వారికైనా మోక్షార్హతని అనుగ్రహిస్తుంది. మూడు లోకాలూ, నాలుగు కాలాలా కూడా భక్తియే ఉత్తమమార్గం, మరీ ముఖ్యంగా కలియుగంలో భక్తికీ పున్న ప్రాధాన్యత మరి దేవికి పుండదు. ఆ యుగంలో జ్ఞానవైరాగ్యాలు ముసలితనం పొందుతాయి. అందువల్ల అవి యెక్కువగా వుపయోగపడకపోవచ్చు.

భక్తులు విన్నా నాకేమీ లేదు. భక్తులే నా సంపద, నాస్థితి ,నాగతి, భక్తుడి కోసం యమధర్మరాజునే కాల్చివేశాను నేను. ఇంతెందుకు దాక్షాయణీ!.. సతీపతి నన్నది భక్తులు పిలిచే పిలుపేగాని నిజానికి నేను భక్తులకు భక్తుణ్ణి అని శివుడు చెప్పినది విని సతీదేవి శివునియందు భక్తిని ఇంకా పెంచుకుంది. అనంతరం మంత్రం, తంత్రం, యంత్రం జ్యోతిష, సాముద్రికాది శాస్త్రాలను కూడా శివుని బోధించాడు. ప్రశ్నించి శివునివల్ల అనుగ్రహింపబడినది. లోకోపకారార్ధం వారలా తర్కించు కుంటారేగాని ఆ సతీ శివులు విడదీయరాని వారు. కొన‌సాగింపు వీడియోతో క‌లుసుకుందాం ఓం న‌మ‌శివాయా..



6, ఆగస్టు 2022, శనివారం

వెంకటేశ్వర స్వామి ఏ యుగంలో భూమి పైన జీవించారు?

వెంకటేశ్వర స్వామి ఏ యుగంలో భూమి పైన జీవించారు?

ఓం నమో వేంకటేశాయ🙏\


శ్రీ వేంకటేశ్వరుడు తిరుమల కొండపై కేవలం కలియుగంలోనే కాదు కృతయుగం నుంచి ఉన్నాడు. ఆనందనిలయ విమానం ప్రత్యక్షమవుతూ అదృశ్యం అవుతూ ఉండేది. వేంకటాచలం పై భక్తులు కానీ, దేవతలు ప్రార్థించినప్పుడు కానీ ఆయన విమానంలో ప్రత్యక్షమవుతూ వారిని అనుగ్రహించిన తర్వాత విమానంతో సహా అదృశ్యమవుతూ ఉండేవారు. ఇలాంటి ఘట్టాలు మనకు పురాణాలలో చాలానే కనిపిస్తాయి. ఉదాహరణకు కొన్ని చూద్దాం.


త్రేతాయుగంలో రాక్షస బాధలు పడలేక, లోకకళ్యాణం చేయమని ప్రార్థించడానకి దేవతలు, బ్రహ్మదేవుడు వెళ్ళారు. శివుడు కూడా వారి వెంట వెళ్లాడు. వేంకటాచలం పై విష్ణువును ప్రార్థించారు. వేంకటాచల మాహాత్మ్యం విన్న దశరథ మహారాజు కూడా తిరుమల కొండకు వెళ్లి పుత్ర సంతానం కోసం శ్రీహరిని ప్రార్థించాడు. అప్పుడు వారందరికీ విమానం ప్రత్యక్షమైంది. విమానంలోకి వెళ్ళగా తన దేవేరులతో శ్రీ వేంకటేశ్వరుడు వారికి ప్రత్యక్షమై తన అవతార స్వీకారం చేసి రావణుడిని సంహరిస్తానని వరం ఇస్తాడు. దశరధునికి శ్రీవారు వరమిస్తూ తన అంశతో నలుగురు కొడుకులు పుడతారని వరమిచ్చాడు. అలా ఆయనకు రామలక్ష్మణభరతశత్రుఘ్నులు పుట్టారు. వేంకటాచలం గురించి విన్న జనకమహారాజు కూడా శేషాద్రికి వెళ్లి స్వామిని స్తుతించాడు.

-----------------------------------------------

తిరుమల కొండపై వైకుంఠ గుహ ఉన్నదని శ్రీరాముడే చెప్తాడు. సీతమ్మ జాడను వెతుక్కుంటూ వెళ్తున్న వానరులు, రామలక్ష్మణులు వేంకటాచల పర్వతానికి వెళ్ళారు. గుంపులు గుంపులుగా వానరులు కొండపై తిరుగుతుండగా కొందరు ఒక గుహలోకి వెళ్ళారు. అక్కడ వారు దివ్య పురుషుల్ని చూసారు. గుహలో లోపలికి వెళ్ళగా సింహాసనం పై అధిష్టించి ఉన్న లక్ష్మీనారాయణులను చూసారు. కానీ వారు ఎవరన్న విషయం తెలియక బయటకు వస్తారు. మరి కొంతమంది వానరులకు చెప్పి అందరూ లోపలికి వెళ్తారు. అప్పుడు వారికి అక్కడ ఏమీ కనపడదు,‌‌ ఎవ్వరూ ఉండరు. ఆశ్చర్యానికి లోనై వారు రాముని వద్దకు వెళ్లి జరిగింది అంతా చెప్పారు. దానికి రాముడు ఈ విధంగా చెప్తాడు ఈ కొండపై శ్రీమన్నారాయణ ఎప్పుడు శ్రీ, భూ, నీళా దేవులతో విహరిస్తూ ఉంటాడు. ఇది ఆయన క్రీడాద్రి. మీకు గుహలో కనపడింది కూడా శ్రీహరే!


ఒకసారి శేషాద్రి పై కొందరు ఋషులు యజ్ఞం చేస్తూ ఉంటారు. ఆ కొండపైనే విహరిస్తున్న నారాయణుడు లక్ష్మికి అది చూపించి అక్కడికి వెళ్ళాలని సంకల్పించి, మానవ రూపాలతో అక్కడికి వెళ్తారు. ఋషుల వారిని లోపలికి ఆహ్వానించారు. హవిస్సులు సమర్పించినప్పుడు వారిద్దరూ లక్ష్మీనారాయణులుగా ప్రత్యక్షమై స్వయంగా హవిస్సులను స్వీకరించి, అంతర్ధానం అవుతారు. అప్పుడు ఋషులు 'ఓహో వచ్చింది సాక్షాత్తు శ్రీదేవితో కూడిన శ్రీ వేంకటేశ్వరుడు! ఈ కొండపై చేయబట్టి కదా వారిద్దరు వచ్చి స్వయంగా హవిస్సులు తీసుకొని, మనల్ని ధన్యులను చేశారు' అని సంతోషించారు.


ఇప్పటివరకు ఇతర యుగాల గురించి చూశాం. ఇప్పుడు కలియుగం గురించి చూద్దాం. కలియుగరంలో వెంకటేశ్వరరావు మాట్లాడేవాడని తొండమాన్ చక్రవర్తి కథ ద్వారా తెలుస్తుంది. తొండమానుడి వల్ల జరిగిన ఒకానొక సంఘటన కారణం చేత వేంకటేశ్వరుడు మాట్లాడకూడదని నిర్ణయించుకున్నాడు. ఏదైనా విషయం చెప్పాలనుకుంటే అర్చకులను ఆవహించి కానీ, స్వప్న సాక్షాత్కారం ద్వారా కానీ చెప్తానని అన్నాడు. కానీ పరమ భక్తులైన వారికి దర్శనం ఇవ్వకుండా ఆయన కూడా ఉండలేడు! అందుకు వెంగమాంబ వంటి వారిని ఉదాహరణగా చెప్పవచ్చు.

ఇక చాలామంది ఆనంద నిలయంలో ఉన్నది కేవలం విగ్రహం అని భావిస్తారు అది ఖచ్చితంగా తప్పు అది విగ్రహం కాదు అని మన పురాణాల్లో స్పష్టంగా ఉంది.


న కృతం దైవసంఘైశ్చ

న కృతం విశ్వకర్మణా

స్వేచ్ఛయ క్రీడతే తత్ర

ఇచ్ఛారూపం విరాజితః


ఆనంద నిలయంలో ఉన్న వేంకటేశ్వరుని మూలమూర్తి దేవతలు తయారు చేసింది కాదు. విశ్వకర్మ చేసినదీ కాదు. తన సొంత ఇచ్ఛతో వేంకటేశ్వరుడు శిలా రూపంలో దర్శనమిస్తున్నాడు.

తేజస్సుతో కూడిన ఆయన రూపాన్ని అనేక పాపాలు చేసే కలియుగంలోని ప్రజలు చూడలేరు. అందుకని అందరికీ తన దర్శనం కలిగి, వారు ధర్మ మార్గంలో నడిచి, ఉద్ధరింపబడాలని ఆయన ఏ తపస్సు లేని మనకు దర్శనమిస్తున్నాడు. నేటికీ ఆ కొండపై తన మహిమలను చాటుతున్నాడు. అయిన వద్దన్న అధర్మ మార్గంలో నడుస్తున్నా, మన అందరికీ ఆయన దర్శనమిస్తూ మనం మారాలని ఓర్పుతో ఆ కొండపైన అలానే నిలబడి ఎదురుచూస్తూ ఉన్నాడు.

అయినా శిలా రూపంతో ఉన్నాడంటే ఒకప్పుడు ఈ కొండ మీద ఉండి, తర్వాత శిలా రూపంలో వెలసి, వైకుంఠానికి వెళ్ళాడు అని అర్థం కాదు. దీన్ని బట్టి ఆయన ప్రతి యుగంలోనూ ఈ భూమిపై ఉన్నాడు. కలియుగంలో శిలారూపంలో మనకి దర్శనమిస్తున్నాడు. ఆయన దర్శనం చేసుకునేటప్పుడు అనంతమైన ఆనందాన్ని అనుగ్రహిస్తున్నాడు. అందుకే ఆయన విమానం పేరు ఆనందనిలయ విమానం! ఆయనను ప్రత్యక్షంగా చూసే అంత తపస్సు మనకు ఉంటే ఖచ్చితంగా ప్రత్యక్షంగా కనిపిస్తాడు. అందుకు అన్నమయ్య, వెంగమాంబ, హాథీరాం, ప్రసన్నవేంకటదాసు వంటి ఎందరో మహనీయుల జీవితం ఉదాహరణ.

స్వర్గం వద్దన్న ముద్గలుడి క‌థ విన్నారా..

 స్వర్గం వద్దన్న ముద్గలుడు

-----------------------------------------------------------------------

ముద్గలుడు సకల సద్గుణ సంపన్నుడు. కురుక్షేత్రంలో భార్య, కుమారుడితో కలసి ఉండేవాడు. ఏడాదిలోని మూడువందల అరవై రోజులూ ఏదో ఒక వ్రతదీక్షలోనే ఉండేవాడు. జపతపాలు చేసుకుంటూ, భిక్షాటనతో కుటుంబ పోషణ చేసుకునేవాడు. అతిథులను ప్రాణప్రదంగా ఆదరించేవాడు. కొన్నాళ్లకు ముద్గలుడు పక్షోపవాస దీక్ష చేపట్టాడు. ఉభయ పక్షాల్లోనూ పాడ్యమి నుంచి పద్నాలుగు రోజులు యాచన ద్వారా సంపాదించిన గింజలతో దైవపూజ, పితృపూజ చేసేవాడు. ఆ పద్నాలుగు రోజులూ ఉపవాసం ఉండేవాడు. ఉపవాస దీక్ష ముగించే ముందు శుక్లపక్షంలో పౌర్ణమినాడు, కృష్ణపక్షంలో అమావాస్యనాడు అతిథులకు భోజనం పెట్టేవాడు. మిగిలినది భార్యా కొడుకులతో కలసి తాను ప్రసాదంగా స్వీకరించేవాడు. 

---------------------------------------------------------------------

ముద్గలుడు ఇలా కాలం గడుపుతుండగా, ఒక పర్వదినం రోజున దుర్వాసుడు అతిథిగా వచ్చాడు. దుర్వాసుడు స్నానాదికాలు చేసి ఎన్నాళ్లో అయినట్లుగా అతి అసహ్యకరంగా ఉన్నాడు. జుట్టు విరబోసుకుని, మురికి కౌపీనంతో పిచ్చివాడిలా ఉన్నాడు. నకనకలాడే ఆకలితో సోలిపోతూ ఉన్నాడు. అతణ్ణి చూసి ముద్గలుడు ఏమాత్రం అసహ్యపడలేదు. సాదరంగా ఎదురేగి స్వాగతం పలికాడు. అర్ఘ్యపాద్యాలు ఇచ్చాడు. స్నానానికి ఏర్పాట్లు చేశాడు. భక్తిశ్రద్ధలతో భోజనం పెట్టాడు. దుర్వాసుడు తిన్నంత తిని, మిగిలినది ఒళ్లంతా పూసుకుని, మాటా పలుకూ లేకుండా తన దారిన తాను వెళ్లిపోయాడు.



mudgudu

---------------------------------------------------------------

ముద్గలుడి ఇంటికి ఇలా ఆరుసార్లు వచ్చాడు దుర్వాసుడు. వచ్చిన ప్రతిసారీ ఇదే తంతు. చక్కగా విస్తరివేసి భోజనం పెడితే, తిన్నంత తినడం, మిగిలినదంతా ఒంటికి పూసుకుని వెళ్లిపోవడమే! దుర్వాసుడి చేష్టలకు ముద్గలుడు ఏమాత్రం కోప్పడలేదు. పరుషంగా మాట్లాడటం కాదు కదా, కనీసం మందలించనైనా లేదు. దుర్వాసుడు వచ్చిన ప్రతిసారీ ముద్గలుడు అతణ్ణి అత్యంత భక్తిశ్రద్ధలతో ఏ లోపమూ లేకుండా సేవించుకున్నాడు. ముద్గలుడి సహనానికి, భక్తిశ్రద్ధలకు ముగ్ధుడైపోయాడు దుర్వాసుడు. 

-------------------------------------------------------------------------------------

‘ముద్గలా! నీ తపస్సుకు, సహనానికి, శాంతానికి, ధర్మనిష్ఠకు నేను ముగ్ధుణ్ణయ్యాను. ఇంతటి తపశ్శక్తి ఏ లోకంలోనూ నేను చూడలేదు. నీవంటి తాపసులు ముల్లోకాల్లో ఎక్కడా ఉండరు. దేవతలు కూడా నీ తపశ్శక్తిని పొగుడుతున్నారు. నీకోసం దివ్యవిమానం ఇప్పుడే వస్తుంది. స్వశరీరంతో స్వర్గానికి వెళ్లి సుఖించు’ అని చెప్పి వెళ్లిపోయాడు. దుర్వాసుడు చెప్పినట్లుగానే ముద్గలుడి ముందు దివ్యవిమానం వచ్చి నిలిచింది. అందులోంచి ఒక దేవదూత దిగివచ్చి, ముద్గలుడికి వినమ్రంగా ప్రణమిల్లాడు. ‘మహర్షీ! అనన్యమైన నీ తపశ్శక్తి ఫలితంగా స్వశరీరంతో స్వర్గ ప్రవేశం చేసే అర్హత నీకు లభించింది. దయచెయ్యి. నాతో కలసి విమానాన్ని అధిరోహించు. నిన్ను స్వర్గానికి తీసుకుపోతాను’ అన్నాడు.


‘మహాత్మా! స్వర్గం అంటే ఏమిటి? అదెక్కడ ఉంటుంది? అక్కడి మంచిచెడ్డలేమిటి? నాకు తెలుసుకోవాలని ఉంది. కుతూహలం కొద్ది అడుగుతున్నానే గాని, నిన్ను పరీక్షించడానికి కాదు. కాబట్టి ఏమీ అనుకోకుండా నా సందేహ నివృత్తి చేయవలసినదిగా ప్రార్థిస్తున్నాను’ అన్నాడు ముద్గలుడు. ‘ఈ మర్త్యలోకానికి పైన చాలా దూరాన ఊర్ధ్వదిశలో ఉంది స్వర్గలోకం. సర్వకాల సర్వావస్థలలోనూ సర్వాలంకార భూషితమై, దివ్యకాంతులతో దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది. గొప్ప తపస్సంపన్నులు, యజ్ఞాలు చేసేవాళ్లు, సత్యనిష్ఠతో జీవితం గడిపినవాళ్లు, ధర్మాత్ములు, దానశీలురు, రణశూరులు, ఇంద్రియాలను జయించిన ఉత్తములు మాత్రమే స్వర్గార్హత సాధించగలరు.


అలాంటి వాళ్లు అక్కడ హాయిగా సర్వసుఖ వైభోగాలతో ఆనందంగా గడుపుతారు. స్వర్గంలో అందమైన అప్సరసలు, సిద్ధులు, సాధ్యులు, దేవర్షులు, మరుత్తులు, వసువులు ఎవరెవరి నెలవుల్లో వారు నివసిస్తూ ఉంటారు. స్వర్గంలో జరా వ్యాధి మరణాలేవీ ఉండవు. ఆకలి దప్పులుండవు. వేడీ చలీ ఉండవు. ఎటు చూసినా మనోహరంగా ఉంటుంది. ఇంద్రియాలన్నీ నిరంతరం ఆనందాన్ని ఆస్వాదిస్తూనే ఉంటాయి’ చెప్పాడు దేవదూత.

-------------------------------------------------------------------------

‘అయినా, స్వర్గం మంచిచెడులు అడిగావు కదూ! ఇప్పటివరకు స్వర్గంలోని మంచివిషయాలన్నీ ఏకరువు పెట్టాను. ఇక స్వర్గానికీ పరిమితులు ఉన్నాయి. అవి కూడా చెబుతాను విను. భూలోకంలో చేసిన పుణ్యఫలాన్నే మనుషులు స్వర్గంలో అనుభవిస్తారు. అక్కడ మళ్లీ పుణ్యం చేయడానికి అవకాశం ఉండదు. భూమ్మీద చేసిన పుణ్యం చెల్లిపోగానే, స్వర్గం నుంచి తరిమేస్తారు. మళ్లీ భూమ్మీద జన్మించవలసిందే!


అలవాటైన సుఖాలను వదులుకోవడం ఎంత కష్టంగా ఉంటుందో ఆలోచించుకో! పుణ్యం నశించిన మనిషి ఆ దుఃఖంతోనే మళ్లీ భూమ్మీద పుడతాడు. బ్రహ్మలోకం తప్ప మిగిలిన పుణ్యలోకాలన్నింటిలోనూ ఇదే తంతు. పుణ్యలోకాల నుంచి తిరిగి భూమ్మీదకు తరిమివేయడబడ్డ మనిషి సుఖవంతుడిగానే పుడతాడనుకో! ఎందుకంటే భూలోకం కర్మభూమి, మిగిలిన పుణ్యలోకాలన్నీ ఫలభూములు. ఇదీ సంగతి. మంచివాడివని ఏదో నీ మీద ఆదరంతో ఇవన్నీ నీతో చెప్పాను. ఇప్పటికే ఆలస్యమవుతోంది. ఇక దయచెయ్యి. స్వర్గానికి బయల్దేరుదాం’ అన్నాడు దేవదూత. 


అంతా విని కాసేపు ఆలోచించాడు ముద్గలుడు. ‘అలాగైతే, ఆ స్వర్గం నాకొద్దు. ఏదో రమ్మని ఆదరంగా పిలిచావు. అదే పదివేలు అనుకుంటాను. ఆ స్వర్గసౌఖ్యాలేవో దేవతలకే ఉండనీ. జపతపాలు చేసుకునే నాకెందుకవన్నీ? వెళ్లు. నీ విమానం తీసుకుని వచ్చినదారినే బయలుదేరు. ఎక్కడికి వెళితే మనిషి మళ్లీ తిరిగి భూమ్మీదకు రాకుండా ఉంటాడో అలాంటి ఉత్తమలోకం కావాలి నాకు. అంతేగాని, పుణ్యఫలాన్ని కొలతవేసి, అంతమేరకు మాత్రమే దక్కే తాత్కాలిక స్వర్గమెందుకు నాకు? శాశ్వతమైన ఉత్తమలోకమే కావాలి నాకు. అలాంటిదానికోసమే ఎంత కష్టమైనా ప్రయత్నిస్తాను’ అన్నాడు ముద్గలుడు. దేవదూత ఎంత బతిమాలినా పట్టించుకోకుండా, అతణ్ణి సాగనంపాడు. 

-----------------------------------------------------

దేవదూతను సాగనంపిన తర్వాత ముద్గలుడు యాచకవృత్తిని కూడా వదిలేశాడు. పరమశాంత మార్గం అవలంబించాడు. నిందాస్తుతులకు చలించడం మానేశాడు. మట్టినీ బంగారాన్నీ ఒకేలా చూసేటంతగా ద్వంద్వాతీత స్థితికి చేరుకున్నాడు. పూర్తిగా తపస్సులోనే మునిగిపోయాడు. నిర్వికల్ప జ్ఞనాయోగంతో తుదకు మోక్షం పొందాడు.

శివుడిని అవ‌మానించిన ద‌క్షుని క‌థ‌

మీరు చూస్తున్న‌ది శివ‌పురాణం

శివుడిని ఎలాగైనా స‌రే అవ‌మానించాల‌ని ద‌క్షప్ర‌జాప‌తి ఒక ఆలోచ‌న చేశాడు. అందులో భాగంగా ఒక యజ్ఞం చేయాల‌ని సంక‌ల్పించాడు. ఆ యఒ్ఙానికి ఒక్క శివుణ్ణి తప్ప అందరినీ ఆహ్వానించాల‌నుకున్నాడు. అనుకున్న‌దే త‌డ‌వుగా యజ్ఞం  ప‌నులు మొద‌లు పెట్టాడు. సామాన్యదేవతలతో పాటు అగ్రదైవాలు, మహామునులను కూడా పిలిచాడు. హరిద్వార సమీపంలో ఒక క్షేత్రాన్ని యెంచుకున్నాడు. ఒక్కొక్క‌రిగా ఆ యఒ్ఙానికి రావ‌డం మొద‌లు పెట్టారు.  వచ్చిన వాళ్ళందరికీ స్వాగ‌తం ప‌లికి, పేరు పేరునా ప‌క‌ల‌రించి వారికి విడుదులు ఏర్పాటు చేశాడు. భృగ్వాదులు మొత్తం యైనభై ఎనిమిది వేలమందీ ఋత్విక్కులుగా ప్రవర్తిస్తున్నారు. ఉద్గాతలు, ఆధ్వర్యులు హోతలూగా అరవై నాలుగు వేలమంది నియమింపబడ్డారు. ఋషిసప్తకం “గాధ” అంటే వేదాంతర్గత చరిత్రములను గానం చేయసాగింది. దిక్పాలకులే యజ్ఞరక్షకులు. యజ్ఞం ప్రత్యక్షమూర్తిగా వెలుగుతుంది. అహుతులు స్వీకరించే నిమిత్తం అగ్ని తన వేనాల్కలతో ప్రజ్వరిల్లిపోతున్నాడు.



-----------------------------------------------------------------------------------

సర్వశుభ సంజ్ఞలాంఛితమైన మహాపురుషుడి దివ్యదేహంలా ఉంది ఆ ప్రాంత మంతా!. ఎటోచ్చి పుర్రెలు ధ‌రిస్తాడు గనుక శివుణ్ణి, ఆయనతో కాపురం చేస్తుంది గనుక అంబనీ ఆహ్వానించలేదు. అంతమందీ వచ్చినా కూడా ఆ ల‌య‌కారుడు రాకపోవడాన్ని కనిపెట్టాడు దధీచి. వెంటనే దక్షుణ్ణి ప్రశ్నించాడు. ఏమోయ్ దక్షా!.. ఇంతకూ ఆ ల‌య‌కారుడు లేకుండా యాగం జరిగితోందేమిటి? సమస్త అమంగళ ప్రశమనుడు, సర్వమంగళప్రదాత అయిన శంకరుడు లేనిదే యజ్ఞం బాగుండదు. ఆయనెందువల్ల రాలేదో మరి. ఆ బ్రహ్మతోనో, విష్ణువుతోనో లేదా అర్హులైన ఋషిగణాలతోనో ఓ పిలుపు పిలిపించు. సాంబశివుణ్ణి రప్పించు.. ఆలస్యం అవుతుంద‌న్నాడు.. అలా అంటున్న దధీచి మాటలు ఏకోశానాన నచ్చలేదు దక్షుడికి. ఇప్పుడు వచ్చిన వాళ్ళకన్నా ఆయనేమంత ఘనుడని ప్రత్యేకంగా కబురుపెట్టాలి. అహూతులెవరూ ఆయనకు తీసిపోరు అయినా వల్లకాట్లో మసలేవాడూ, చితాభస్మధారుడూ, అస్థిలాభూషణుడూ, పాములవాడు అయిన అతగాడు రాకపోతే కొంపేమీ మునిగిపోదు. అయినా అప్పట్లో ఏదో బ్రహ్మమాటకొట్టేయ లేక కూతుర్నిచ్చి పెళ్లి చేశానేగాని అదంతా ఆయన గారి గొప్పతనం మాత్రం కాదు. కావాలనే పిలువలేదు నేను. 

ఆ గొడవ ఆపి వచ్చినవాళ్లు, మీరందరూ కలిసి యజ్ఞం శుభంగా ముగించండి" అన్నాడు ద‌క్షుడు. మెల్ల‌గా న‌వ్వాడు దధీచి 'ఇక నువ్వు యఒ్ఙం చేసినట్టేలే!.. అనేసి అక్కడి నుంచి బ‌య‌లుదేరుతూ. “శివుణ్ణి నిరాకరించినచోట నిమిషం కూడా నిలువబోనని చెప్పి అక్క‌డి నుంచి వెళ్లిపోయాడు. అయినా చలించలేదు దక్షుడు. శివుడేకాదు శివ ప్రియులైన ఈ దధీచిలాంటి వాళ్ళు కూడా లేకపోతేనే యజ్ఞానికి. మంచిది పోతేపోనివ్వండి. శుద్ధ విష్ణుపరాయణులూ, వేదమార్గ ప్రవర్తకులూ అయిన వాళ్ళే నాకు చాలు. మీరంతా కలిసి నా యజ్ఞం సఫలం చేయండి అని అక్క‌డి వారితో అన్నాడు. దధీచితో పాటు మ‌రికొంత మంది బ‌య‌లుదేరుతూ శివుడు లేని చోట మేముకూడా ఉండ‌ము అని చెప్పి వెళ్లిపోయారు. ఇక పోయిన వారు పోగా మిగిలిన వారు  యజ్ఞానికి సిద్ద‌మ‌య్యారు.

ఇక త‌రువాతి వీడియోలో ద‌క్ష య‌గ్నానికి స‌తీదేవి బ‌య‌లుదేరుట గురించి తెలుసుకుందాం. ఓం న‌మ‌శివాయా..

శివునిపై దక్షుడి అలక

శివుని పై దక్షుడి అలక


ఒకానొక స‌మ‌యంలో కొందరు మునులు కలసి ప్రయాగక్షేత్రంలో యజ్ఞం చేయసాగారు. ఆ యజ్ఞానికి సనక సనందాది సిద్దులు నారదాది దేవర్షులు, మరీచ్యాది ప్రజాపతులు ఇలా ఒకరేమిటి? రాదగ్గ వాళ్లంతా వచ్చారు. సాక్షాత్తూ శివుడు కూడా వచ్చాడు. ఈశ్వ‌రుడిని చూడ‌గానే అక్క‌డ వున్న వారంతా లేచి న‌మ‌స్కారం చేశారు. కాసేపు శివుడిని ప్రార్థించి వారంతా ధ‌న్యులు అయ్యారు. ఆ త‌రువాత శంక‌రుడు త‌న‌కు కేటాయించిన ఆస‌నంపై ఆసీనుల‌య్యారు. శివుని ప్రార్థ‌న త‌రువాత అక్క‌డి వాతావ‌ర‌ణం చాలా ప్రశాంతంగా ఉంది. 

-------------------------------------------------------

మరికొంత సేపటికి దక్షప్రజాపతి కూడా వచ్చాడు. వస్తూనే బ్రహ్మకు నమస్కరించాడు. ఆయనను చూసి అందరూ లేచారు. నమస్కరించారు. దక్షుణ్ణి కీర్తించారు. అంద‌రూ ద‌క్షుడిని కీర్తిస్తుంటే మ‌రొప‌క్క శివుడు మాత్రం తన స్థానంలోంచి కదలకుండా అలాగే కూర్చుని వుండిపోయాడు. దక్షుడికది అవమానంగా తోచింది. అందరూ తనని గౌరవిస్తున్నప్పుడు అంబికేశుడు మాత్రం అలా మౌనంగా వుండడం ఆయనకు అస్స‌లు గిట్టలేదు. ఆ గిట్టని తనం తనలోనే దాచుకోలేక బైటపెట్టేశాడు. దేవ, దానవ, సిద్ధ, సాధ్య, ముని గణాలన్నీ నాకు మ్రొక్కులిడుతుండగా యీ భూత, ప్రేత సహవాసుడైన శివుడు మాత్రం నన్ను సత్కరించకుండా మౌనంగా కూర్చుండి పోవడంలో అర్థం మేమిటి? నన్నఅవమానించడమేగా! అన్నాడు. అంత‌టితో ఆగ‌కుండా న‌న్ను గౌర‌వించ‌ని ఈ భూత నాధుడ్ని శపిస్తున్నాను. ఈ రుద్రుడు ధర్మబహిష్కృతుడై పోవాలి. యజ్ఞంలో పాల్గొనలేక పోవాలి. దేవతలతో సమానంగా హవిర్భాగం యితనికి చెందకుండా పోవాలి అని శపించాడు. ఆ మాట‌లు అన్నీ వింటున్న నందికేశ్వరుడు కలగచేసుకున్నాడు. ఎవరి స్మరణ మాత్రం చేత సమస్తమైన యజ్ఞాలూ సఫలాలైపోతున్నాయో, అట్టి శివుణ్ణి యజ్ఞబాహ్యుడిగా శపించడం కేవలం నీ అవివేకమయ్యా బ్రాహ్మణాధమా! అన్నాడు. 



ఆ మాటలతో అగ్గిమీద గుగ్గిలం వేసినట్టు, భగుమన్నాడు దక్షుడు. నువ్వెంత వాడిని నాకు చెప్పడానికి! అసలు మీ రుద్రగణాలన్నీ వేదమార్గాన్ని పరిత్యజింతురు గాక, మహర్షి సంప్రదాయాలకు దూరమై పోదురుగాక, శిష్టాచార బహిష్కృతులై జటాభస్మధారులై చరింతురుగాక అని శపించాడు. 


నందికేశ్వరుడు మాత్రం యేమైనా తక్కువ తిన్నాడా? ఓరి శతుడా! మీ బ్రాహ్మణులంతా కేవలం వేదోక్త కర్మవాదులై పోవుదురుగాక. వేదార్థమైన శివతత్వం మీకు పట్టుబడకుండా వుండుగాక. అభిజాత్యహీనులూ యాచకులూ అయ్యెదరు గాక, నిత్యం దాన పరిగ్రహులయి దరిద్రులై పోవుదురుగాక, దుష్టదాన స్వీకరణాఘ సంతృప్తులై కొందరు నరక వాసులయ్యెదరు గాక మరికొందరు బ్రహ్మరాక్షసులయ్యెదురుగాక. శివుణ్ణి సర్వేశ్వరుడిగా కాక కేవలం త్రిమూర్తులలో ఒకడుగా మాత్రమే భావించే వాళ్ళంతా తత్త్వజ్ఞాన హీనులగుదురుగాక! ఇక నువ్వు ఆత్మోద్ధరణ మార్గాన్ని వదలి పశుప్రాయుడిపై కేవలం కర్మనిష్టాపరుడివై-అతి త్వరలోనే ముఖుడివై అలరారెదవు గాక అని ప్రతి శాపం పెట్టేశాడు. ఈ శాపాల యుద్ధంలో అందరూ హాహాకారాలు చేశారు. 

బ్రహ్మదేవుడు దక్షుణ్ణి మందలించాడు. శివుడు నందికేశ్వరుణ్ణి మందలించాడు. యజ్ఞం అయిందనిపించి యెవరి దారిన వారి వారి స్వస్థానాలకు వెళ్లారు. రుద్రుడు రుద్రుడు అని ఒత్తి ఒత్తి పలకడమే గాని, నిజానికి సత్యగుణ సముద్రుడు గదా శివుడు. అందువల్ల ఆయన రుద్ర గణాలూ కూడా జరిగింది మర్చిపోయారు. కానీ దక్షుడు మాత్రం ఇదంతా మర్చి పోలేకపోయాడు. మనసులో కక్ష పెంచుకున్నాడు శివమాయా పరివృత్తుడై తామసంలో తలమునకలై పోయాడు. శివుడంతటి వాణ్ణి శిక్షించాలనుకున్నాడు. కొన‌సాగింపు ఉంటుంది గ‌మ‌నించ‌గ‌ల‌రు. ఓం న‌మ‌శివాయా..

 Ep3 ఎపిసోడ్ నం. 3 సృష్టి ఎలా మొదలైంది సృష్టికి పూర్వము ఈ జగత్తంతా జలమయంగా ఉండేది. ఎటు చూసినా మహా సముద్రమే. దానికి ఎల్లలు లేవు. ఆ నీటి నుం...