6, ఆగస్టు 2022, శనివారం

శివునిపై దక్షుడి అలక

శివుని పై దక్షుడి అలక


ఒకానొక స‌మ‌యంలో కొందరు మునులు కలసి ప్రయాగక్షేత్రంలో యజ్ఞం చేయసాగారు. ఆ యజ్ఞానికి సనక సనందాది సిద్దులు నారదాది దేవర్షులు, మరీచ్యాది ప్రజాపతులు ఇలా ఒకరేమిటి? రాదగ్గ వాళ్లంతా వచ్చారు. సాక్షాత్తూ శివుడు కూడా వచ్చాడు. ఈశ్వ‌రుడిని చూడ‌గానే అక్క‌డ వున్న వారంతా లేచి న‌మ‌స్కారం చేశారు. కాసేపు శివుడిని ప్రార్థించి వారంతా ధ‌న్యులు అయ్యారు. ఆ త‌రువాత శంక‌రుడు త‌న‌కు కేటాయించిన ఆస‌నంపై ఆసీనుల‌య్యారు. శివుని ప్రార్థ‌న త‌రువాత అక్క‌డి వాతావ‌ర‌ణం చాలా ప్రశాంతంగా ఉంది. 

-------------------------------------------------------

మరికొంత సేపటికి దక్షప్రజాపతి కూడా వచ్చాడు. వస్తూనే బ్రహ్మకు నమస్కరించాడు. ఆయనను చూసి అందరూ లేచారు. నమస్కరించారు. దక్షుణ్ణి కీర్తించారు. అంద‌రూ ద‌క్షుడిని కీర్తిస్తుంటే మ‌రొప‌క్క శివుడు మాత్రం తన స్థానంలోంచి కదలకుండా అలాగే కూర్చుని వుండిపోయాడు. దక్షుడికది అవమానంగా తోచింది. అందరూ తనని గౌరవిస్తున్నప్పుడు అంబికేశుడు మాత్రం అలా మౌనంగా వుండడం ఆయనకు అస్స‌లు గిట్టలేదు. ఆ గిట్టని తనం తనలోనే దాచుకోలేక బైటపెట్టేశాడు. దేవ, దానవ, సిద్ధ, సాధ్య, ముని గణాలన్నీ నాకు మ్రొక్కులిడుతుండగా యీ భూత, ప్రేత సహవాసుడైన శివుడు మాత్రం నన్ను సత్కరించకుండా మౌనంగా కూర్చుండి పోవడంలో అర్థం మేమిటి? నన్నఅవమానించడమేగా! అన్నాడు. అంత‌టితో ఆగ‌కుండా న‌న్ను గౌర‌వించ‌ని ఈ భూత నాధుడ్ని శపిస్తున్నాను. ఈ రుద్రుడు ధర్మబహిష్కృతుడై పోవాలి. యజ్ఞంలో పాల్గొనలేక పోవాలి. దేవతలతో సమానంగా హవిర్భాగం యితనికి చెందకుండా పోవాలి అని శపించాడు. ఆ మాట‌లు అన్నీ వింటున్న నందికేశ్వరుడు కలగచేసుకున్నాడు. ఎవరి స్మరణ మాత్రం చేత సమస్తమైన యజ్ఞాలూ సఫలాలైపోతున్నాయో, అట్టి శివుణ్ణి యజ్ఞబాహ్యుడిగా శపించడం కేవలం నీ అవివేకమయ్యా బ్రాహ్మణాధమా! అన్నాడు. 



ఆ మాటలతో అగ్గిమీద గుగ్గిలం వేసినట్టు, భగుమన్నాడు దక్షుడు. నువ్వెంత వాడిని నాకు చెప్పడానికి! అసలు మీ రుద్రగణాలన్నీ వేదమార్గాన్ని పరిత్యజింతురు గాక, మహర్షి సంప్రదాయాలకు దూరమై పోదురుగాక, శిష్టాచార బహిష్కృతులై జటాభస్మధారులై చరింతురుగాక అని శపించాడు. 


నందికేశ్వరుడు మాత్రం యేమైనా తక్కువ తిన్నాడా? ఓరి శతుడా! మీ బ్రాహ్మణులంతా కేవలం వేదోక్త కర్మవాదులై పోవుదురుగాక. వేదార్థమైన శివతత్వం మీకు పట్టుబడకుండా వుండుగాక. అభిజాత్యహీనులూ యాచకులూ అయ్యెదరు గాక, నిత్యం దాన పరిగ్రహులయి దరిద్రులై పోవుదురుగాక, దుష్టదాన స్వీకరణాఘ సంతృప్తులై కొందరు నరక వాసులయ్యెదరు గాక మరికొందరు బ్రహ్మరాక్షసులయ్యెదురుగాక. శివుణ్ణి సర్వేశ్వరుడిగా కాక కేవలం త్రిమూర్తులలో ఒకడుగా మాత్రమే భావించే వాళ్ళంతా తత్త్వజ్ఞాన హీనులగుదురుగాక! ఇక నువ్వు ఆత్మోద్ధరణ మార్గాన్ని వదలి పశుప్రాయుడిపై కేవలం కర్మనిష్టాపరుడివై-అతి త్వరలోనే ముఖుడివై అలరారెదవు గాక అని ప్రతి శాపం పెట్టేశాడు. ఈ శాపాల యుద్ధంలో అందరూ హాహాకారాలు చేశారు. 

బ్రహ్మదేవుడు దక్షుణ్ణి మందలించాడు. శివుడు నందికేశ్వరుణ్ణి మందలించాడు. యజ్ఞం అయిందనిపించి యెవరి దారిన వారి వారి స్వస్థానాలకు వెళ్లారు. రుద్రుడు రుద్రుడు అని ఒత్తి ఒత్తి పలకడమే గాని, నిజానికి సత్యగుణ సముద్రుడు గదా శివుడు. అందువల్ల ఆయన రుద్ర గణాలూ కూడా జరిగింది మర్చిపోయారు. కానీ దక్షుడు మాత్రం ఇదంతా మర్చి పోలేకపోయాడు. మనసులో కక్ష పెంచుకున్నాడు శివమాయా పరివృత్తుడై తామసంలో తలమునకలై పోయాడు. శివుడంతటి వాణ్ణి శిక్షించాలనుకున్నాడు. కొన‌సాగింపు ఉంటుంది గ‌మ‌నించ‌గ‌ల‌రు. ఓం న‌మ‌శివాయా..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 Ep3 ఎపిసోడ్ నం. 3 సృష్టి ఎలా మొదలైంది సృష్టికి పూర్వము ఈ జగత్తంతా జలమయంగా ఉండేది. ఎటు చూసినా మహా సముద్రమే. దానికి ఎల్లలు లేవు. ఆ నీటి నుం...