17, జులై 2022, ఆదివారం

కలియుగాంతం ఎప్పుడో చెప్పే ఆలయం

కలియుగాంతం ఎప్పుడో చెప్పే ఆలయం

పానకాల స్వామి మహిమ..


.......
మంగళగిరి అనగానే ఠక్కున గుర్తుకు వచ్చేది పానకాల లక్ష్మీనరసింహాస్వామి ఆలయం.. ఆ తరువాత స్వామికి ప్రసాదంగా సమర్పించే పానకమే గుర్తుకు వస్తోంది. మనదేశంలో హిందువులు కొలిచే దేవాలయాలు అనేకం ఉన్నాయి. వాటిలో ఒక్కో ఆలయానికి ఒక్కో చరిత్ర ఉంటుంది. అలాంటి చరిత్ర కలిగిన ఆలయాల్లో ఒకటి పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. యుగాంతం ఎప్పుడు జరుగుతుందో తెలిపే ఆలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటి.

గుంటూరు జిల్లా మంగళగిరిలో కొలువైన ఈ స్వామి మహత్యం అంతా ఇంతా కాదు. భక్తులు ఏది కోరుకున్నా ఇట్టే జరుగుతుందని ప్రతి ఒక్క భక్తుడు చెబుతుంటాడు.. ఇక్కడ ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం వాస్తవంగా రెండు దేవాలయాల కింద లెక్క. ఒకటి కొండ కింద ఉన్న లక్ష్మీనరసింహ స్వామి ఆలయం. రెండవది కొండపైన ఉన్న పానకాల స్వామి ఆలయం. కొండపైన వున్న దేవాలయంలో విగ్రహమేమీ ఉండదు. కాని తెరుచుకుని ఉన్న నోరు ఆకారంలో ఒక రంధ్రం ఉంటుంది. ఆ తెరచుకున్న రంధ్రమే పానకాల స్వామిగా భక్తులు నమ్ముతారు. 

మంగళగిరి లక్ష్మీనారసింహా స్వామికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ స్వామికి పానకం అంటే మహా ఇష్టం.. అందుకే బెల్లం, పంచదార, చెరకుతో ప్రతి రోజు అభిషేకం చేస్తారు. అభిషేకం చేసిన తరువాత సగం పానకాన్ని స్వామి త్రాగి, మిగిలిన సగాన్ని భక్తులకు ప్రసాదంగా వదిలిపెడతాడు. ఎంత పానకం అభిషేకించినా, అందులో సగమే త్రాగి, మిగిలిన సగాన్ని భక్తులకు వదలడం ఇక్కడ విశేషం. అందుకనే స్వామిని పానకాలస్వామి అని పిలుస్తారు. పానకాలస్వామికి ప్రతి రోజూ డ్రమ్ముల కొద్దీ పానకాన్ని తయారు చేస్తుంటారు. కాని పానకం తయారు చేస్తున్నప్పుడు ఒకవేళ కిందపడినా ఈగలు చీమలు అస్సలు చేరవు. 

సాక్ష్యాత్తు ఆ మహా విష్ణువు ఈ కొండపై వెలశాడని, లక్ష్మీదేవి ఈ కొండ శిఖరంపై తపస్సు చేసిందని భక్తులు నమ్ముతారు. లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం పెద్ద పాండవ సోదరుడు అయిన యుధిష్ఠిరునిచేత స్థాపించబడిందని విశ్వసిస్తారు. ఈ ఆలయం గురించిన పూర్తి సమాచారం, ఆలయ విశిష్టత, చరిత్ర పాత హిందూ మత గ్రంథాలలో ఒకటైన బ్రహ్మ వైవర్త పురాణంలో పూర్తిగా వ్రాయబడింది.. ఈ దేవాలయాన్ని అప్పట్లో విజయనగర పాలకులు పోషించారని శాసనాల్లో వ్రాయబడింది.

శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి గాలిగోపురం రాష్ట్రంలో అత్యంత ఎత్తయినది. రెండు శతాబ్దాలను పూర్తి చేసుకుని ఇప్పటికీ చూపరులను ఆకట్టుకుంటుంది. 11 అంతస్తులు, 157 అడుగుల ఎత్తు కలిగి, 49 అడుగుల పీఠభాగంతో గాలిలో ఠీవిగా నిలబడి భక్తులకు ఆహ్వానం పలుకుతుంది. దీనిని 1807 - 09 కాలంలో నాటి ధరణికోట జమిందారు శ్రీ రాజా వాసిరెడ్డి వేంకటాద్రినాయుడు నిర్మించారు. ఈ గోపుర పీఠభాగం పూర్తిగా రాతితో నిర్మించబడింది.

శాసన స్తంభం ప్రత్యేకత :
శాసన స్తంభం, ప్రధాన వీధిలో రామాలయం వద్ద ఉంటుంది. అందుకే ఈ వీధికి శాసన స్తంభం వీధి అని పేరు వచ్చింది. ఈ వీధిలో ఎనిమిది ముఖాలు కలిగిన ఒక శాసనం ఉంది. ఈ శాసనంలో 46 పంక్తులు తెలుగులోను, 4 పర్షియన్‌లోను వ్రాసి ఉంటాయి. 1565 నుండి మంగళగిరి గోల్కొండ కుతుబ్‌ షాహిల పాలనలో ఉండేది. 1593లో కుతుబ్‌ షాహి వృత్తి పన్ను బాగా పెంచేసాడు. అది కట్టలేని చేనేత కార్మికులు మచిలీపట్నం వంటి ప్రాంతాలకు వలస వెళ్ళిపోయారు. ఈ విషయం తెలిసిన సుల్తాను వాళ్ళను వెనక్కి రప్పించమని తన సేనాధిపతి ఖోజా ఆలీని ఆదేశించాడు. ఖోజా ఆలీ పన్నును తీసివేస్తున్నట్లు, ఇతర పన్నులు కూడా నాలుగు వాయిదాలలో కట్టవచ్చని ప్రకటించాడు. అదే విషయాన్ని ఈ శాసనంపై చూడవచ్చు. 

పెద్ద కోనేరు
మంగళగిరి మధ్యలో, అర ఎకరం వైశాల్యంలో కోనేరు ఉంటుంది. దీని పేరు కల్యాణ పుష్కరిణి. 1558లో విజయనగర రాజుల అధీనంలో ఉండగా దీనిని తవ్వించారు. చాలా లోతైన ఈ కోనేటికి నాలుగు వైపుల మెట్లు ఉంటాయి. లక్ష్మీనారసింహా స్వామి దేవాలయానికి చెందిన ఈ కోనేటిలో రెండు బావులు కూడా ఉన్నట్లుగా చెబుతారు. గుడికి తూర్పున శివలింగం ఉంటుంది. 1832 నాటి కరువులో కోనేరు ఎండిపోంది. అప్పుడు 9,840 తుపాకులు, 44 గుళ్ళు బయటపడ్డాయి. ఇవి పిండారీలకు చెందినవని పురావస్తుశాఖవారు చెబుతున్నారు. ఈ కోనేటి అడుగున ఒక బంగారు గుడి ఉందని ప్రజలు బాగా నమ్ముతారు. ఇదే విషయాన్ని 1883లో గార్డన్  మెకెంజీ అనే అతను కృష్ణా జిల్లా మాన్యువల్‌లో రాశాడు. 

19వ శతాబ్ధంలో మారెళ్ళ శీనయ్యదాసు అనే అతను కోనేటిలో ఆంజనేయ స్వామి గుడిని నిర్మించాడు. దాంతోపాటు రెండెకరాల స్థలాన్ని దానమిచ్చాడు. శతాబ్దాలపాటు ప్రజలు ఈ కోనేటి నీటితోనే దేవునికి అభిషేకాలు జరిపించారు. 2004లో కృష్ణా పుష్కరాల సందర్భంగా కోనేటికి ప్రహరీగోడ నిర్మించారు. జయ స్తంభం, శ్రీ కృష్ణదేవరాయల శాసనం పానకాలస్వామి ఆలయానికి వెళ్లే మెట్ల మార్గం మొదట్లో ఉంటాయి. శ్రీ కృష్ణదేవరాయలచే ఈ శాసనం ప్రతిష్ఠింపబడినదని చాలా మంది చెబుతారు. కానీ వాస్తవానికి ఇది రాయల మహామంత్రి అయిన సాళువ తిమ్మరుసుకు చెందినది. 1515 సంవత్సరంలో జూన్  23వ తేదీన శ్రీ కృష్ణదేవరాయలు కొండవీటిని జయించాడు. ఆ విజయానికి గుర్తుగా ఈ శాసనం వ్రాయించాడు. రాయల విజయాన్ని సూచించే ఈ స్తంభాన్ని జయ స్తంభం అంటారు. అమరావతి పాలకుడైన నాదెండ్ల తిమ్మయ్య ఇచ్చిన 19 దానశాసనాల ప్రసక్తి కూడా దీనిపై వ్రాయబడింది. దీనిలోని 198వ వరుస నుండి 208వ వరుస వరకు మూడు ముఖ్యమైన చారిత్రక సమాచారాలు వ్రాయబడ్డాయి.

యుగాంతాన్ని సూచించే ఆలయం :
యుగాంతం దగ్గరపడుతుందని తెలిపే ఆలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటి. అయితే ఇక్కడ స్వామికి నైవేద్యంగా సమర్పించే పానకమే అందుకు నిదర్శనం. ఆలయంలో పానకం కింద పడినా ఈగలు, చీమలు రావని ముందే తెలుసుకున్నాం కదా... ఎప్పుడైతే ధర్మం నశించి యుగాంతం జరగబోతుందో అప్పుడు సూచనగా ఈగలు, చీమలు, చేరతాయి... ఇక్కడి ఆలయంలో చీమలు, ఈగలు వచ్చాయంటే యుగాంతం దగ్గరపడుతుందని అర్థం. 

ఈ వీడియో మీకు నచ్చితే like, comment, Share చేసి, subscribe చేయగలరు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 Ep3 ఎపిసోడ్ నం. 3 సృష్టి ఎలా మొదలైంది సృష్టికి పూర్వము ఈ జగత్తంతా జలమయంగా ఉండేది. ఎటు చూసినా మహా సముద్రమే. దానికి ఎల్లలు లేవు. ఆ నీటి నుం...